జీవితంలో స్థిరపడి విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టగానే కొత్తరకం పరీక్షలు మొదలవుతాయి. ఇవి నిరంతరం కొనసాగుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. సమస్యలతో చుట్టుముడతాయి. తట్టుకొని నిలబడాలి. వాటితో రణానికి సిద్ధపడాలి. చిక్కుముడులు విప్పాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. అందరూ ఎదుర్కోవాల్సిందే. బోధించే గురువులుండరు. కాగితాలపై సమాధానాలు రాయనక్కరలేదు. గణన చేసి ఎవరూ ఎవరినీ ఉత్తీర్ణుల్ని చేయరు, ఓటమిపాలు చేయరు. ఎవరికి వారే గురువులుగా మారాలి. శిష్యులుగా సమాయత్తం కావాలి. సమాజ అధ్యయనం, మనస్తత్వ పరిశోధన, లౌకిక వ్యవహార నిర్వహణ వంటి పాఠాలను రోజూ చదవాలి. నీపై దృష్టి నిలిపేవారిని నువ్వు క్షుణ్నంగా పరిశీలించాలి. వ్యక్తులను బేరీజు వేయాలి. వారి ప్రవర్తనను త్రాసులో తూచాలి. లోక సంబంధ వ్యవహారాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అనుక్షణం ఎదురయ్యే ప్రతి సమస్యా ఒక పరీక్షే. ప్రతికూలాంశాలను
నేర్పుతో, ఓర్పుతో అనుకూలంగా మార్చుకోవాలి. ఆలోచన, అవగాహన, అనుభవం, ముందుచూపు వంటి సూత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి. తెలివితో ఇతరుల్ని ఒప్పించి మెప్పించి సమాధానపరచాలి. సున్నితమైన, అంతే కఠినమైన ఆర్థిక సంబంధ చిక్కులను నేర్పుతో విడదీయాలి. అలాంటివారే ఈ సదీక్షల్లో విజేతలుగా నిలుస్తారు.
Негізгі бет 905వ నామమ్, జీవితంలో అడుగడుగునా పరీక్షలుంటాయి….
Пікірлер: 2