ఎవరో, ఎప్పుడో సహాయపడతారన్న ఆశ ఉన్న మనుషులే భయపడేది. ఎవరూ లేరు, ఎప్పుడూ రారు అని నిర్ధారణ జరిగిపోయి ఏకాకి అవగానే, భయం పోతుంది. తను వొక్కడే తనకోసం జీవించి ఈ శక్తులను ఎదుర్కోవాలి. స్నేహితులు, బంధువులు, గురువులు, గ్రంధాలు, సలహాలు, వేదాంతాలు అన్నీ కడసారి యదార్థాన్ని ఎదుర్కొన్నప్పుడు వృథా, అదే కొత్త బలం. నూత్న వికాసం. అది మొండి, గుడ్డి ధైర్యం కాదు. ఇంద్రియాలన్నింటినీ ఏకగ్రీవంగా జీవింప చేసి, సర్వ శక్తుల్నీ ఖంజాయింపు జేసుకుని, మూడో నేత్రం తెరచుకుని ఒక్కసారిగా, చెలరేగిన సాహసం అది.
( చివరకు మిగిలేది - బుచ్చిబాబు)
ఈ రోజు ప్రముఖ రచయిత,చిత్రకారులు శ్రీ శివరాజు వెంకట సుబ్బారావుగారి వర్ధంతి🙏💐.(1967, సెప్టెంబర్ 20)
బుచ్చిబాబు గారి కథలు అనగానే అందరికీ గుర్తొచ్చే కథలు నన్ను గురించి కథ రాయవూ,అరుకు లోయలో కూలిన శిఖరం,4711 టాస్కా...కానీ నేను చదివిన మొదటి కథ వారిది ' బీ '. 'రచన ' మాసపత్రిక లో పాతికేళ్ల క్రితం పునర్ముద్రితం అయింది.ఎన్ని సార్లు చదివానో....కొన్ని వాక్యాలు అందులో నుండి.....
ఆ కళ్ళ ఆకర్షణ మామూలు ఆకర్షణ కాదు. అది అందంగా కూడా కనబడదు .కొన్ని జలచరాల మెదడు పైన మణులుండే వంటారు. ఆ మణి లో భీభత్సంగా కనబడి గగుర్పాటు కలగజేసే ఒక వికృతమైన ఆకర్షణ ఉంటుంది. అలాంటి ఆకర్షణ ఆమె కళ్ళలో ఉంది.
పిల్లలకి కదలిక అంటే చాలా ఇష్టం .ఫ్యాన్ నిలిపి కదిలేటట్లు చేయడంలో వారి శక్తి ప్రకటితమవుతుంది .మగ పిల్లలకి కదిలే ఆట వస్తువులంటే ఇష్టం .ఆడపిల్లలకి కదలని బొమ్మలంటే ఎక్కువ ఇష్టం. ఈ సూత్రాన్ని గుర్తుంచుకునే నేటి ఆట వస్తువులు తయారవుతున్నాయనుకుంటా.
ఆ అమ్మాయికీ నాకూ ఎలాంటి సంబంధం లేదు. ఉండదు .అయినా ఎందుకో మా ఇద్దరి మధ్య ఒక చిత్రమైన సన్నిహితత్వం ఏర్పడినట్లయింది .తరచి చూస్తే అది కనబడదు .కారణాలు వెతికితే దొరకవు .సముద్రం లోంచి ఆవిరి లేచి మేఘం గా మారి క్షణంలో భూమ్యా కాశాలను ఏకం చేసి, కదిలి మాయమవడం లో ఉన్న స్థూలత్వమే ఈ ఆప్యాయత లోని అనుభవానికీ ఉందనిపిస్తుంది.
ఈ ప్రాణి ఏ కొత్త విషయం సాధిస్తుందో చూద్దామన్నట్లుగా వొక్కొక్క జీవుడిని లోకం లోకి నెట్టుతుంది సృష్టి . తన ఉనికిని పెంపొందించుకోవాలనే సృష్టి అభిలాష. దానికి తోడ్పడేందుకు ప్రాణులను సృష్టిస్తుంది .ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క సృష్టి రహస్య పరిశోధకుడు. వారి వారి కృషి ఫలించిందీ లేనిదీ సృష్టికే తెలుస్తుంది. పెడతోవని వెళ్లిన వారినీ, మిడిసిపడి ,అతి గా శోధించిన వారినీ సృష్టి మందలిస్తూనే ఉంటుంది. తన శక్తికి మించిన శక్తి గల ప్రాణులొచ్చిపడితే భరించలేదు. అట్లాంటి ప్రాణి హోషిమా బీ. గుండ్రంగా తిరిగే కంటి పాపల నేత్రాలు గల శారీరక వైచిత్రి ని తెచ్చుకుని సృష్టి రహస్యాన్ని శోధించడానికి పూనుకుంది ఆమె. ఆ కదిలిపోయే సృష్టిని , తిరిగే విశ్వాన్ని ఒక్క క్షణం ఆపుతానంటుంది హోషిమా బీ. అంతటి శక్తి ఆమె శరీరం ఉంచుకోలేదు. దైవానికి సాధ్యం కాని కార్యం ఆమెకి ఎందుకు సాధ్యం కాకూడదో ఆమెకి తెలీదు పాపం .ఈ రకం పరిశోధనకా ఆమెనిక్కడికి పంపించడం !తగదని తీసుకుపోయింది సృష్టి.
ఒక చిత్రమైన మనసు విశ్లేషణ ఈ బీ కథ.
Негізгі бет బీ/బుచ్చిబాబు గారు
Пікірлер: 20